AP Budget: Major Boost for Amaravati Development
AP Budget: అమరావతీ ఊపిరి పీల్చుకో…
నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రాధాన్యం బడ్జెట్లో రూ.3,445 కోట్లు కేటాయింపు
Amaravati’s Future Brightens with Doubled Funding: వైఎస్సార్సీపీ సర్కారు విధ్వంసక విధానాల వల్ల నిలిచిన రాజధాని నిర్మాణాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్‌లో అమరావతికి రూ.3,445.33 కోట్లు కేటాయించింది. ప్రధాన మౌలిక వసతులకు రూ.3,000 కోట్లు నిధులను సమకూర్చింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులకు రూ.400 కోట్లు, అమరావతి స్మార్ట్‌సిటీస్ కార్యక్రమంలో భాగంగా సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులకు రూ.32 కోట్లు, హైకోర్టు భవనంలో వసతుల కల్పనకు రూ.13.33 కోట్లును వెచ్చించనుంది.
రాజధానికి నిధులు: ఐదేళ్ల అనంతరం మళ్లీ బడ్జెట్‌లో అమరావతి ప్రస్తావన ప్రముఖంగా కనిపించింది. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని దాదాపుగా కొలిక్కి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేయడంతో రాజధాని పనులు పరుగులు పెట్టబోతున్నాయి. రాజధానికి సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసానివ్వడం, ప్రపంచబ్యాంకు (World Bank), ఏడీబీల (ADB) నుంచి రూ.15,000 కోట్ల రుణ ప్రక్రియ కొలిక్కి రావడం, రూ.12,000 కోట్లు ఇచ్చేందుకు హడ్కో అంగీకరించడంతో ఆర్థిక వనరుల లోటు తొలగిపోయింది.
ఇక నాలుగు నెలలే సమయం: రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు (World Bank), ఏడీబీ (ADB- Asian Development Bank) కలిసి రూ.15,000 కోట్ల రుణం ఇస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి వచ్చే నిధుల్ని సీఆర్‌డీఏకు (CRDA) విడుదల చేసేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక హెడ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదివారం (నవంబర్ 10న) ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రతిపాదన ఆధారంగా హెడ్ కిందే వార్షిక బడ్జెట్‌లో రూ.3,000 కోట్లు చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక నాలుగు నెలలే మిగిలి ఉంది.
జనవరి ఆఖరులోగా టెండర్లు: రాజధాని పనుల్ని ప్రారంభించేందుకు ప్రస్తుతానికి ఆ నిధులు సరిపోతాయని ప్రజాప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అమరావతిలో ప్రధాన రహదారులు, వరద నివారణ కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం, యుటిలిటీ డక్ట్లు, రైతులకు స్థలాలు కేటాయించిన లే అవుట్‌ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం వంటి పనులకు సీఆర్‌డీఏ (CRDA) సుమారు రూ.50,000 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. జనవరి ఆఖరులోగా టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
రైతులకు ఊరట: అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలును సకాలంలో చెల్లించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులకు పాత బకాయిలతో పాటు ఏటా క్రమం తప్పకుండా కౌలు చెల్లించేలా విధంగా చర్యలు తీసుకుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. వైఎస్సార్సీపీ సర్కారు పెట్టిన బకాయిలతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) కౌలునూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు చాలా వరకు చెల్లించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు (Smart City Project) కింద రాజధానిలోని గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతులకు పనులకు రూ.32 కోట్లు కేటాయించడం వల్ల అత్యాధునికంగా నిర్మిస్తున్న అమరావతితో సమానంగా గ్రామాలూ అభివృద్ధి చెందేందుకు వీలవుతుంది.