₹15,000 Crore Loan Sanctioned for Amaravati in October
అమరావతి కి రుణం అక్టోబర్ లో మంజూరు
అమరావతి: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధుల అమరావతి పర్యటన మంగళవారంతో ముగిసింది. అమరావతి నిర్మాణానికి రుణం సమకూర్చేందుకు ఈ రెండు బ్యాంకులు ముందుకు రావడంతో వాటి ప్రతినిధులు ఈనెల 20 నుంచి పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ, సీఆర్డీఏ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులను పరిశీలించారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, అధికారులతో భేటీ అయ్యారు. అమరావతి బృహత్ ప్రణాళిక, మౌలిక వసతుల పరిస్థితి, రైతుల ప్లాట్ల అభివృద్ధి, కోర్టు కేసులు, రైతుల భాగస్వామ్యం.. భూసమీకరణలో వారి మద్దతు, వరద నిర్వహణ, పర్యావరణం అంశాల గురించి చర్చించారు. వీరు వచ్చే నెల మూడో వారంలో మరో దఫా రానున్నారు.
అప్పుడు రుణం గురించి మరింత స్పష్టత రానుంది. ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి రూ.15 వేల కోట్లకు సీఆర్డీఏ డీపీఆర్‌ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఈనెల 30న విదేశీ రుణాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ విభాగం.. ఆ నివేదికను పరిశీలించనుంది. అనంతరం ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీలకు పంపనుంది. అక్టోబరులో ఈ బ్యాంకుల బోర్డు సమావేశాలు జరగనున్నాయి. వాటిలో అమరావతి నిర్మాణానికి సంబంధించి రుణ ప్రతిపాదనలపై చర్చించి ఖరారు చేసే అవకాశముంది.